1. దానశీలం

చదువండి - ఆలోచించి చెప్పండి

      కర్ణుని పూజామందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అన్నాడు.

      సూర్యుడు           :  పుత్రా ! కర్ణా ! బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయనా. జాగ్రత్త !

      కర్ణుడు: తండ్రీ ! ఇంద్రుడంతటివాడు రూపం మార్చుకొని ‘దేహి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను.

ఈ శరీరం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే. నేను కాదనను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా. కాని నన్ను వారించకండి.    

 ప్రశ్నలు 

1.   సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణమేమిటి ? 

జ.  కవచకుండలాలను దానం చేస్తే, కర్ణుని ప్రాణానికే ముప్పు వస్తుంది. అందుకే సూర్యుడు, కర్ణుని దానం చేయకుండా ఆపాలని ప్రయత్నించాడు.

2.   కర్ణుని మాటలను బట్టి మీకేమర్థమైంది ?

జ.  కర్ణుడు గొప్పదాత అని అర్థమయ్యింది. మానవులకు శరీరం శాశ్వతం కాదని అర్థమయ్యింది. ఆపద వచ్చినా సరే, కర్ణుడు నిర్భయంగా దానం చేసే మహాదాత అని అర్థం అయ్యింది.

3.   ప్రాణానికి ముప్పని తెలిసినా కర్ణుడు ఎందుకు దానం చేశాడు ?

జ.  1) దేవతల రాజు దేవేంద్రుడంత గొప్పవాడు, తన దగ్గరకు వచ్చి ‘దేహి అన్నందువల్లనూ,

      2)  తన శరీరం శాశ్వతం కాదని తెలిసినందువల్లనూ, కీర్తిని కోరి కర్ణుడు దానం చేశాడు.

4.   ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా ? ఎవరు ?         

జ.  1)  బలిచక్రవర్తి : ఇతడు కూడా కర్ణుని వలెనే దానవీరుడు. బలిచక్రవర్తి వామనుడు తనను అడిగిన విధంగా వామనుడికి మూడు అడుగులు నేలను దానంచేస్తే, వామనుడు తన మూడు అడుగులతో మూడు లోకాలనూ కొలిచే త్రివిక్రముడు అవుతాడని, బలిచక్రవర్తిని ఆయన గురువు శుక్రాచార్యుడు ముందే హెచ్చరించాడు. అయినా బలిచక్రవర్తి, వామనుడికి దానం చేశాడు.

      2) శిబి చక్రవర్తి : ఇతడు పావురానికి శరణమిచ్చి, డేగ నుండి పావురాన్ని రక్షించడానికి, తన శరీర మాంసం కోసి ఇచ్చిన మహాదాత.

      3) రంతిదేవుడు : ఇతడు తనకు ఉన్నదానిని అంతా అడిగినవారికి ఇచ్చాడు. 40 రోజులు ఉపవాసం ఇతడు చేయవలసి వచ్చింది. ఆ తరువాత దొరికిన అన్నాన్ని కూడా పూర్తిగా అతిథులకు ఇతడు పంచి ఇచ్చాడు.

టెస్ట్:

1. పూజామందిరంలో పూజ చేస్తున్నది ఎవరు?                            (అ)

    అ) కర్ణుడు             ఆ) సూర్యుడు         ఇ) ఇంద్రుడు      ఈ) బ్రాహ్మణుడు

2.  కర్ణునికి ఎవరు ప్రత్యక్షమయ్యారు?                                (ఆ)

    అ) బ్రాహ్మణుడు      ఆ) ఇంద్రుడు          ఇ) సూర్యుడు      ఈ) నారదుడు 

3.   బ్రాహ్మణ వేషంలో వచ్చేది ఎవరు?                                (ఆ)

    అ) కర్ణుడు             ఆ) సూర్యుడు         ఇ) ఇంద్రుడు     ఈ) తుంబురుడు

4 'వారించకండి' అంటే అర్థమేమిటి?                                (ఇ)

అ) సరే అనకండి         ఆ) అడ్డు చెప్పండి    ఇ) అడ్డు చెప్పకండి     ఈ) విడిచి వెళ్ళండి